Wednesday, November 10, 2010

‘ఆ నలుగురు’

ఏడుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన కథ ‘ఆ నలుగురు’

హీరో చనిపోవడంతో ఈ సినిమా మొదలవుతుంది. నృత్యాలూ పోరాటాలూ మసాలా సన్నివేశాలు ఇందులో ఎక్కడా కనిపించవు. అంతా మానవ సంబంధాలు, ఆర్థిక బంధాల గురించిన అన్వేషణే. కానీ, ఈ సినిమా ప్రేక్షకుణ్ణి ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేసింది. ఇదేమీ ఆషామాషీగా తయారైన కథ కాదు. ఎన్నో తిరస్కారాలు... ఎంతో ప్రసవవేదనతో బయటకొచ్చిన సినిమా ఇది. రచయిత మదన్ సమాజం నుండి తయారు చేశాడు ఈ కథను. తను డిగ్రీ ఫైనలియర్ చేస్తున్నపుడే దీనికి తొలి బీజం పడింది. మదనపల్లికి సమీపంలోని బి.కొత్తకోట అనే పల్లెటూళ్లో... ఊరంతా అప్పులు చేసి చనిపోయిన ఒకాయన జీవితమే ఈ కథకు స్ఫూర్తి. అలా మదన్ మనసులో ఆ విత్తు కాస్తా మొక్కగా ఎదిగింది. ఆ మొక్కకు ‘ఆ నలుగురు’ అని నామకరణం చేశాడు.

2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చి ఓ టీవీ చానెల్‌ను సంప్రదించాడు మదన్. ‘ఆ నలుగురు’ను 26 ఎపిసోడ్ల టీవీ సీరియల్‌గా చేయాలన్నది మదన్ ఆశ. అక్కడ తిరస్కారం ఎదురైంది. ఒకప్పుడు బాగా సినిమాలు తీసి విశ్రాంత జీవితం గడుపుతున్న సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు మళ్లీ సినిమాలపై గాలి మళ్లింది. మదన్ చెప్పిన ‘ఆ నలుగురు’ లైన్ నచ్చి బౌండెడ్ స్క్రిప్టు రెడీ చేయమన్నారు. ఏడుగురు దర్శకులు ఈ కథ విని సినిమాగా చేయడం చాలా కష్టమని తేల్చిపారేశారు. ప్రకాశ్‌రాజ్‌కు వినిపిస్తే నవలలా ఉందన్నారు.

కానీ సీనియర్ రైటర్ డి.వి. నరసరాజు మాత్రం మంచి ప్రయత్నమని ఉత్సాహపరిచారు. కె.భాగ్యరాజా కథ వినగానే ఉద్వేగానికి లోనై ‘‘తెలుగు, తమిళ భాషల్లో నేనే చేస్తాను... అయితే హీరో నేనే’’అన్నాడు. అది అట్లూరి వారికి ఇష్టంలేదు. అది చేస్తే గీస్తే తమిళ నటుడు విసునో, దాసరి నారాయణరావో, మోహన్‌బాబో చేయాలన్నది ఆయన మనసులోని ఆలోచన.

నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి. పూర్ణచంద్రరావుక్కూడా విసుగొచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఎంటరయ్యాడు. ‘‘నా ఫ్రెండ్స్‌తో కలిసి నేనే తీసుకుంటా’’ అని చెప్పి ‘ఆ నలుగురు’ హక్కులు తీసుకున్నారు.

రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌కు రెడీ అన్నారు. వేరే పని మీద చంద్రసిద్ధార్థ్ దర్గరకు వచ్చిన ప్రేమ్‌కుమార్ ‘‘ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ’’ అన్నాడు. అలా ‘ఆ నలుగురు’ తయారైంది. ప్రేక్షకుల మనసు గెలవడం... బంగారు నంది పొందడం... ఇండియన్ పనోరమకు ఎంపిక కావడం... ప్రశంసల జల్లుల్లో తడిసి ముద్ద కావడం... ఈ చరిత్ర అంతా మీకు తెలిసిందే.

కన్నడంలో ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ చేస్తే, మరాఠీలో సయాజీ షిండే చేశారు. అలాగే తమిళంలో రజనీకాంత్, హిందీలో అమితాబ్ బచ్చన్‌తో చేయాలని ఓ నిర్మాత కలలు కన్నారు కూడా. కానీ ఎందుకనో కుదర్లేదు. - పులగం చిన్నారాయణ

Tuesday, September 7, 2010

మంచి సినిమాలు

కొన్ని సినిమాలు చూసిన కొన్ని రోజులతర్వాత కూడా పాత్రలు కాని,సన్నివేశాలు కాని మన మనసులో ఏదో ఒక సమయంలో గుర్తుకు వస్తుంటే అటువంటి సినిమాలు మంచి సినిమాలు. ఇప్పుడు అటువంటి మంచి సినిమాలు కొన్ని తెలుసుకుందాం.


 1 ) లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ :



ఇది ఒక ఇటాలియన్ సినిమా. మనసును గిలిగింతలు పెడుతూనే కళ్ళను చేమర్చేలా చేస్తుంది. "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ " రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నసమయంలో జరుగుతుంది. ఒక తండ్రి తన కుమారుడితో పాటు సైన్యం చేతిలో బందీలుగా ఉంటారు. ఆ  విషయం చెప్పకుండా మనం ఒక ఆట ఆడుతున్నాం, మనం గెలిస్తే యుద్ద ట్యాంకర్ ఇస్తారని చెప్పుతాడు. తన కుమారుడుకి తను అనుభవిస్తున్న కష్టాలను కూడా నవ్వుతూ ఇదంతా ఆటలో ఓ భాగం అని చెపుతాడు. చివరికి సైన్యం చేతిలో తను  మరణించిన తన బిడ్డను తల్లి దగ్గరకు చేరుకునేటట్లు చేస్తాడు.

ఈ సినిమాలో మొదటి భాగం హీరో,హీరోఇన్ల ప్రేమ కథ చాల బాగుంటుంది. కాని తండ్రి కొడుకల మధ్య ఉండే ప్రేమ,ఆప్యాయత రెండవ భాగంలో ఉండి మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటాం,కష్టకాలంలో కూడా ఎలా ఉండవచ్చో అన్న విషయం తెలుస్తుంది.